కేఎల్ఐ మోటార్లు ఆన్ చేసినా.. రైతులకు సాగునీరు ఎందుకివ్వడం లేదు?: బీఆర్ఎస్ ఫైర్

కలం, వనపర్తి: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLI) పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి రైతులకు సాగునీటి (Irrigation Water) ని విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, జిల్లా మీడియా కన్వీనర్‌ నందిమల్ల అశోక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మేఘారెడ్డికి విమర్శించే నైతికత ఎక్కడిదనీ, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ప్రాజెక్టులు, సాగునీటి అంశాలపై అవగాహన లేదంటూ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. అవగాహన లేని ప్రకటనలతో ప్రజల్లో ఎమ్మెల్యే చులకన అవుతున్నారని విమర్శించారు. కేఎల్‌ఐ పరిధిలో సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున దానిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ హెచ్చరికల తర్వాతే మోటార్లు?

ఈ నెల 11వ తేదీన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ (Narlapur Reservoir) ముట్టడికి పిలుపునిస్తామని బీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో హెచ్చరించిన తర్వాతే ప్రభుత్వం కేఎల్‌ఐ మోటార్లను ఆన్‌ చేసిందని నాయకులు ఆరోపించారు. ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లలో మోటార్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించడం కూడా బీఆర్‌ఎస్‌ ఒత్తిడి ఫలితమేనన్నారు. అయితే మోటార్లు నడుపుతున్నామని చెబుతున్నా రైతులకు సాగునీరు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. గుడిపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నప్పటికీ కాలువలకు నీటిని విడుదల చేయలేదని పేర్కొన్నారు.

తాగునీటికే పరిమితం చేస్తే ఎలా?

ఎల్లూరు, గుడిపల్లి, జొన్నలబొగడ రిజర్వాయర్లను తాగునీటి అవసరాల కోసం నింపేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులకు సాగునీరు అందించడంపై చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. కేఎల్‌ఐ పరిధిలోని సుమారు 500 చెరువులు, కుంటలను వెంటనే నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎల్లూరు, జొన్నలబొగడలో మోటార్ల పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. జొన్నలబొగడలో ఒక్క మోటారే నడుస్తోందని తెలిపారు. గుడిపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తున్నా కాలువలకు సాగునీరు విడుదల కాలేదని అన్నారు.

వానాకాలం, యాసంగికి నీరివ్వాలి

కేఎల్‌ఐ (KLI Irrigation Water) పంపులు సుమారు 200 రోజులపాటు నడిపే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, నందిమల్ల అశోక్‌ కోరారు. వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసి రిజర్వాయర్లను నింపి పంటలకు సాగునీరు అందించారని వారు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని వారు ఆరోపించారు. సాగునీటి విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కె.మాణిక్యం, గంధం పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్‌, ధర్మశాస్త్ర, మహేశ్వర్‌రెడ్డి, జోహెబ్‌ హుస్సేన్‌, సయ్యద్‌ జమీల్‌, పాండు తదితరులు పాల్గొన్నారు.

Also Read : బీజేపీతో పొత్తుపై జనసేన క్లారిటీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>