రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం

క‌లం, వెబ్‌డెస్క్‌: రష్యా (Russia) నుంచి చమురు, సహజవాయువును భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే బిల్లుకు అమెరికా (US)సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై కూడా భారీ టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అయితే సెనేట్ ఆమోదంతోనే భారత్‌పై వెంటనే కొత్త టారిఫ్‌లు అమల్లోకి రావు. బిల్లు ముందుగా ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

రష్యా నుంచి వచ్చే చమురు, సహజవాయువు ఆదాయాన్ని తగ్గించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. రష్యా ఇంధనంపై ఆంక్షలను తప్పించుకునేందుకు సహకరించే దేశాలు, సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారులపై ఆంక్షలు, రష్యా రక్షణ రంగానికి సహకరించే విదేశీ సంస్థలపై చర్యలు వంటి అంశాలు కూడా బిల్లులో ఉన్నాయి. రష్యా మొత్తం సహజవాయువు ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసుకునే దేశాలకు కొన్ని మినహాయింపులు కల్పించే నిబంధనలు కూడా ఉన్నాయి.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 ఫిబ్రవరిలో ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకరించగా, భారత వస్తువులపై 18 శాతం పరస్పర టారిఫ్ రేటును అమెరికా ప్రతిపాదించింది. అనంతరం అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ టారిఫ్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సెక్షన్ 301 కింద భారత్‌పై అదనంగా 10 శాతం టారిఫ్ అమల్లో ఉంది. బిల్లు హౌస్‌లో ఆమోదం పొంది, అధ్యక్షుడి సంతకం చేసే వరకు 100 శాతం టారిఫ్‌లు భారత్‌పై అమలులోకి వచ్చినట్లుగా పరిగణించలేమని స్పష్టమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>