కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో విద్యాశాఖ అలర్ట్ అయ్యింది. రాష్ట్రం మొత్తానికి అమలు అయ్యేలా కొత్త సర్క్యులర్ జారీ చేసింది. అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు, అన్– ఎయిడెడ్ పాఠశాలలు (Telangana Schools) తప్పనిసరిగా పాలకమండలి సభ్యుల సంతకాలతో ఫీజుల నిర్ణయాన్ని డాక్యుమెంట్ రూపంలో తమ సొంత వెబ్‌సైట్‌తోపాటు ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
అలాగే పాఠశాల నోటీసు బోర్డులో ఫీజుల పట్టిక ను ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని, ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం ద్వారా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల విషయంలో తల్లిదండ్రులకు స్పష్టత రావడంతో పాటు, విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ తెలిపింది.
అడ్డగోలు ఫీజులు.. ఆందోళనలు
ప్రైవేటు స్కూళ్లలో రకరకాల పేర్లతో ఫీజుల దందా నడుస్తున్నదంటూ పేరెంట్స్ అసోసియేషన్స్ పలుమార్లు ధర్నాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. నియంత్రించాలని ముఖ్యమంత్రికి విన్నవించాయి. రాష్ట్రంలోని సుమారు 12 వేల ప్రైవేట్ పాఠశాలలు ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతున్నాయని పేరెంట్స్ అసోసియేషన్లతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు పెంచాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు స్కూల్స్ అడ్డగోలుగా పెంచుతూ దోచుకుంటున్నాయని ఆరోపించాయి.
పత్తా లేని ఫీజుల బిల్లు
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కింద నిర్ణయించింది. రెండేళ్లకోసారి 8 శాతం చొప్పున ఫీజు పెంపును ప్రతిపాదిస్తూ ఏడాదిన్నర కింద డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం చేసింది. ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించేందుకు ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమెయిన్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరిలో ఆదేశించారు. అయినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
ఫీజులపై నియంత్రణే లేదు..
ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ విధానం అమలు కావడం లేదు. గతంలో ప్రాథమిక తరగతులకు రూ.9 వేలు, ఉన్నత తరగతులకు రూ.13 వేల చొప్పున ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి పాఠశాల యాజమాన్యాలే స్వయంగా ఫీజులను నిర్ణయిస్తున్నాయి.
తరగతుల వారీగా ఫీజుల వివరాలను ప్రదర్శించడంతో పాటు ఆడిట్ నివేదికలను సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫీజుల నియంత్రణకు రూపొందించిన ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, మంత్రివర్గంలో చర్చించిన అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

