కలం, కరీంనగర్ బ్యూరో: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించేలా కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) సానుకూల నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri ) కోరారు. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి మంత్రి మాట్లాడారు.
అనంతరం జంతర్‌మంతర్‌లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధర్నాకు మంత్రి సంఘీభావం ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని, ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ పరిపాలన స్ఫూర్తి భారతదేశ ప్రజాస్వామ్యానికి శాశ్వత దిక్సూచి అని అన్నారు.
డాక్టర్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదని, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త కూడా అని పేర్కొన్నారు. ఆయన రచించిన భారత ద్రవ్య విధాన చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పరిశోధనల్లో ఒకటిగా నిలిచిందని, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటుకు ముందు జరిగిన ద్రవ్య విధాన చర్చల్లో ఆయన ఆర్థిక ఆలోచనలు, సూచనలు విశేష ప్రభావం చూపాయని వివరించారు.
“డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వల్లనే నాతోటి ఒక దళితుడు మంత్రి అయ్యే అవకాశం లభించింది. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. బడుగు, బలహీన వర్గాల సాధికారత కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్. ఆయన లేకపోతే వెనుకబడిన వర్గాల నేటి సామాజిక, విద్యా, రాజకీయ స్థితిని ఊహించడం కూడా కష్టమే” అని మంత్రి అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచే కరెన్సీ నోట్లపై డాక్టర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించడం ద్వారా రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం పట్ల భారతదేశ నిబద్ధత ప్రపంచానికి మరింత బలంగా చాటిచెప్పినట్లవుతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీకి దేశం ఇచ్చిన గౌరవం మాదిరిగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు సైతం తగిన జాతీయ గౌరవం దక్కాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరుశురాం నాయకత్వంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఇప్పటివరకు 26 సార్లకు పైగా జంతర్‌మంతర్‌లో శాంతియుత ధర్నాలు నిర్వహిస్తూ కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారని మంత్రి తెలిపారు.
ఒకే లక్ష్యంతో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సమితి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన “కోలాటంతో ఢిల్లీపై కొట్లాట” కార్యక్రమం విశేష ఆకర్షణగా నిలిచింది. దాదాపు 50 మంది మహిళలు సంప్రదాయ కోలాటం ప్రదర్శించగా డప్పు కళాకారులు జానపద గీతాల ద్వారా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ వినూత్న సాంస్కృతిక ప్రదర్శన ప్రజలు, మీడియా ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, CAPSS జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

