కలం, కరీంనగర్ బ్యూరో: ఆగస్టు 15న జరగబోయే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తలపెట్టిన హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం, ‘తిరంగా యాత్ర’ లను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ తిమ్మాపూర్ (Thimmapur ) మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మహాత్మా నగర్‌లోని శ్రీ తపాలా లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కళ్యాణ మండపంలో హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం సన్నాక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరంగా యాత్ర నిర్వహణ కోసం బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని, దేశభక్తిని చాటేలా ఈ నెల 10 నుండి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాములు ప్రారంభం అవుతాయని తెలిపారు. మండల పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ప్రోగ్రామ్ లను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టి, ప్రజలు విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు.
అలాగే ఆగస్టు 12 నుంచి 14 వరకు మహాపురుషుల, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు శుద్ధి చేసి , స్మారక చిహ్నాల చుట్టూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు అన్ని మండలాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి పౌరుడిని మానసికంగా దేశంతో అనుసంధానించే సామాజిక ఉద్యమంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాములు ప్రతి ఏటా ఘనంగా జరుగుతున్నాయని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాలి: చింతం శ్రీనివాస్
హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రోగ్రాం లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలు ప్రతి ఇంటిపై ఎగరాలని , ఆ దిశగా పార్టీ శ్రేణులు కృషి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల (Thimmapur) అధ్యక్షులు చింతం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ నిబంధనల వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హతల నిబంధనలు పేదలు, వృద్ధులు, వితంతు మహిళలు, నిజమైన అర్హుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా 70 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అత్యంత అన్యాయమైన నిర్ణయం అన్నారు. 57 సంవత్సరాల వయస్సు దాటిన ఎంతో మంది పేద వృద్ధులు పని చేయలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిని పెన్షన్‌కు దూరం చేయడం దారుణమన్నారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 70 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే వితంతు మహిళలకు 40సంవత్సరాల వయోపరిమితి విధించడం కూడా పూర్తిగా అన్యాయమని , భర్తను కోల్పోయిన మహిళ ఏ వయస్సులో ఉన్నా ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, వితంతు పెన్షన్‌కు ఎలాంటి వయోపరిమితి లేకుండా అర్హులైన ప్రతి వితంతు మహిళకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజల విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోతే, ఈ అన్యాయమైన నిబంధనలను ఉపసంహరించుకోకపోతే, భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ (Thimmapur) మండల శాఖ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కల్యాణ్ చంద్ర , జిల్లా ఈసీ మెంబర్ మావురపు సంపత్ మండల జనరల్ సెక్రెటరీ గొట్టిముక్కల తిరుపతిరెడ్డి , సీనియర్ నాయకులు పాశం రాఘవరెడ్డి ,ఎర్రోజు లక్ష్మణ్ ,ఎలుక పెళ్లి స్వామి, బుర్ర శ్రీనివాస్ ,పడాల శ్రీను, విశ్వరూప చారి బూత్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి ,రాపర్తి రవీందర్, నరేషు ,గంటూ రాజు ,పిట్ట మహేశ్ మాడిశెట్టి నరేష్ ,బుడిగ మహేష్ కుమార్ ,మహేందర్ రెడ్డి, జక్కోజు అనిల్ ,బూరుగు శ్రీనివాస్ రెడ్డి, కామర వెంకటేష్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : అరిహా చరిత్ర.. ఆసియాలో భారత్‌కు తొలి బంగారు పతకం
Follow Us On: Instagram

