కలం, మహబూబ్ నగర్ బ్యూరో: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో ఆవిష్కరణలే చోదక శక్తిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “విజన్ ఇండియా–2047: ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్” రెండు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఏఐ, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్‌లు వంటి రంగాలే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయని మంత్రి జూపల్లి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. క్యూర్ , ప్యూర్, రేర్, మహిళలు అనే నాలుగు అభివృద్ధి స్తంభాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
అప్పుల ఊబిలో గ్రామీణ భారతం..
గ్రామీణ భారతం ఇప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉండటం ఆందోళన కలిగించే అంశమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కార్పొరేట్ విద్య, వైద్యం వైపు అధికంగా మొగ్గు చూపడం, సామాజిక అనుకరణలో భాగంగా వివాహాలు, ఇతర కుటుంబ వేడుకలను ఆడంబరంగా నిర్వహించడం వలన అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆశించిన స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోయామని చెప్పారు.
నాణ్యమైన ప్రభుత్వ విద్య, వైద్య సేవలను అందించడం ద్వారానే వికసిత్ భారత్–2047, రైజింగ్ తెలంగాణ–2047 లక్ష్యాలను సాధించవచ్చని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. సామాజిక రుగ్మతలపై ప్రజల్ని చైతన్యవంతం చేసేలా త్వరలోనే ప్రభాత భేరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తల తయారీ, సమాజాభివృద్ధికి కేంద్రాలుగా ఎదగాలని మంత్రి సూచించారు.
Also Read : తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తికి డ్యూటీ .. డాక్టర్ సస్పెండ్!
Follow Us On : WhatsApp

