కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి (Jogipet Hospital)లో దారుణ ఘటన వెలుగుచూసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కే. రమేష్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని డ్యూటీలో కూర్చోబెట్టి వైద్యం చేయిస్తున్నట్లు తేలడంతో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుడి స్థానంలో ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడనే వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించిన మంత్రి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించి లోతుగా విచారణ జరిపింది.
ఈ తనిఖీల్లో డాక్టర్ రమేష్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, తన స్థానంలో రవి అనే ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టి డ్యూటీ చేయిస్తున్న మాట వాస్తవమేనని విచారణ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది. కమిటీ అందించిన సమగ్ర నివేదిక ఆధారంగా ప్రభుత్వం డాక్టర్ రమేష్‌పై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది. నిబంధనలను అతిక్రమించి, రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించిన సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

