కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలాయపాలెం (Tirumalayapalem) మండలంలో పర్యటించిన మంత్రి.. రూ.6.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తోందని అన్నారు. ఇప్పటికే మంజూరైన 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి త్వరలోనే రెండో విడత ప్రొసీడింగ్స్ జారీ చేస్తామని తెలిపారు.
ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బిల్లులు జమ చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. అలాగే ఆగస్టు 15 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, నూతన రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, వరికి రూ.500 బోనస్, ఎకరాకు రూ.6 వేల రైతు భరోసా సాయం, గురుకులాలలో పెంచిన డైట్ ఛార్జీలు వంటి పథకాలతో పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

