కలం, మునుగోడు: నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో మునుగోడు (Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy) అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, అధికారుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలనలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు బాధ్యతగా పనిచేయాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం తన వద్ద ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. లంచాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు.
“నాకు పదిసార్లు ఎమ్మెల్యేగా గెలవాలనే అవసరం లేదు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశాను. ప్రజాసేవ చేయడమే నా ప్రధాన లక్ష్యం” అని రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy) వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, అవినీతిపై జారీ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులలో అప్రమత్తత నెలకొంది. ప్రజా ప్రయోజనాల కోసం ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : తన స్థానంలో ప్రైవేట్ వ్యక్తికి డ్యూటీ .. డాక్టర్ సస్పెండ్!
Follow Us On : WhatsApp

