కలం, మహబూబ్ నగర్ బ్యూరో : చేనేత రంగ అభివృద్ధికి, నేత కార్మికులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta ) తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
చేనేత వస్త్రం వెనుక చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉంటాయని, చేతితో నేసిన ప్రతి వస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని కలెక్టర్ అన్నారు. యంత్రాలతో తయారయ్యే వస్త్రాలతో పోలిస్తే చేనేత ఉత్పత్తులకు కళాత్మకత, నాణ్యత, సంప్రదాయం ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గద్వాల్, నారాయణపేట చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేనేత కార్మికులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహబూబ్‌నగర్ శిల్పారామంలో స్థానిక చేనేత ఉత్పత్తుల విక్రయానికి స్టాల్ ల కేటాయింపు ప్రాధాన్యం కల్పించనున్నట్లు, ఆసక్తి ఉన్న చేనేత కార్మికులు హ్యాండ్లూమ్ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జిల్లాకు వచ్చే విశిష్ట అతిథులకు అందించే బహుమతులు, శాలువాలు స్థానిక చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా చేనేత కార్మికుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.చేనేత కార్మికుల సమస్యలు, సూచనలు తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు అవసరమైతే గ్రామాల్లో పర్యటించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడతామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు.
ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రతి చేనేత వస్త్రం వెనుక కార్మికుల అపారమైన శ్రమ, నైపుణ్యం దాగి ఉంటుందని ఆమె అన్నారు. చేనేత కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నాణ్యమైన వస్త్రాలను తయారు చేస్తున్నారని, వారిని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వినియోగించడం ద్వారా కార్మికుల జీవనోపాధికి తోడ్పడటంతో పాటు మన వారసత్వాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాల వినియోగాన్ని అలవాటు చేసుకుని చేనేత రంగ అభివృద్ధికి సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ అందించారు. అలాగే జిల్లా నుండి గుర్తించిన ఉత్తమ చేనేత కార్మికులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాళ్లను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సందర్శించి, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాలు, ఇతర వస్త్రాల తయారుకు ఎంత ఖర్చు అవుతుంది, వాటిని ఎంత ధరకు అమ్ముతున్నారు అనే విషయాలను వారికి అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులు తయారు చేసిన నారాయణపేట, గద్వాల కాటన్ చీరలను జిల్లా కలెక్టర్ చూసి చాలా బాగున్నాయని అన్నారు. అనంతరం ఆమె కొన్ని చీరలను కొనుగోలు చేశారు. అలాగే జిల్లా అధికారులు, ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలను కొనాలని, చేనేత కార్మికులకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డి. ఆర్.ఓ ఎ. నిర్మలా, జిల్లా హ్యాండ్లూమ్ అభివృద్ధి అధికారి రాజేష్ , చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తొలుత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం గేట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు

