కలం, వెబ్‌డెస్క్: ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో ప్రతిభ చాటాడు. ప్రతిష్టాత్మక ‘సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ 2026 టోర్నమెంట్ (Saint Louis Rapid and Blitz Tournament) ను ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నాడు. టోర్నమెంట్ ఆద్యంతం అత్యుత్తమ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ మొత్తం ఐదు రోజుల పాటు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రజ్ఞానంద కెరీర్‌లో ఇదే మొదటి గ్రాండ్ చెస్ టూర్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ కావడం విశేషం.
ప్రజ్ఞానంద టోర్నమెంట్ ముగింపునకు ఒక రౌండ్ ముందే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. ఇక చివరి రోజు మూడు వరుస గేమ్స్‌లో విజయం సాధించి, ఉత్కంఠభరిత పోరులో జావోఖిర్ సిందరోవ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 27 గేమ్‌లు ఆడిన ప్రజ్ఞానంద కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయాడు. చివరి గేమ్‌లో లెవోన్ అరోనియన్‌తో డ్రా చేసుకొని మొత్తం 23.5/36 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు. ప్రత్యర్థుల కంటే 1.5 పాయింట్లు ఆధిక్యంలో నిలిచి ఘన విజయం సాధించాడు.

