కలం, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ (ఎఫ్‌టీఈ) ఉద్యోగుల దశాబ్దకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) భరోసా ఇచ్చారు. ఉద్యోగుల ‘పే స్కేల్’ అమలు సహా ప్రధాన డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గురువారం ఉపాధి హామీ ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ప్రతినిధులతో మంత్రి సమావేశమై.. ‘పే స్కేల్’ అమలు, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, బదిలీల విధానం, ఇతర సర్వీస్ అంశాలపై చర్చించారు. డీఎస్సీ ద్వారా 2006లో ఎంపికై దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ ‘పే స్కేల్’ అమలు కాలేదని, ఇది కేవలం జీతాల సమస్య కాదని, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని మంత్రికి ఆ సంఘాల ప్రతినిధులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 మంది ఎఫ్‌టీఈ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ‘పే స్కేల్’ అమలుకు నెలకు సుమారు రెండున్నర కోట్లు, ఏడాదికి దాదాపు రూ. 30 కోట్ల అదనపు భారం మాత్రమే ప్రభుత్వంపై పడుతుందని వివరించారు.
ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విన్న మంత్రి సీతక్క.. త్వరలోనే మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై తదుపరి చర్యలపై చర్చిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు, ఆందోళనలకు వెళ్లవద్దని సూచించారు. పని నిలిపివేయడం కంటే బాధ్యతాయుతమైన మార్గాల్లో ప్రభుత్వాన్ని అప్రోచ్ కావాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘జీ రామ్ జీ’ చట్టం అమలుతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులకు ప్రమాద బీమా (ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్) పథకాన్ని అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో గత మూడు నెలలుగా ఉపాధి హామీ ఉద్యోగుల జీతాల చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. కానీ ఆ ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు చెల్లించే ప్రతిపాదన చేసినా కేంద్రం అంగీకరించలేదని, అందువల్లే జీతాల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆమె వివరించారు.

