నాడు నిర్మాణం.. నేడు విస్మరణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకున్న నడిగడ్డ రిజర్వాయర్ల (Nadigadda Reservoirs) ను, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్‌లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు.

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా ధరూర్ మండలం నెట్టెంపాడు ఎత్తిపోతల చేపట్టారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టి. 2009 లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది‌.. పేజ్ -1లో గూడెందొడ్డిలో నిర్మించిన రిజర్వాయర్2 టిఎంసి, పేజ్ 2లో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ ను 2 టిఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ నిర్మాణం చేపట్టారు.

కాగా, ర్యాలంపాడు పూర్తి స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు నుంచి 4 టీఎంసీలకు పెంచారు. అయితే నిర్మాణ సమయంలో నాణ్యతతో పనులు చేపట్టకపోవడంతో 2019లో రిజర్వాయర్‌ సీపేజీ నీటి లీకేజీలు మొదలయ్యాయి. ర్యాలంపాడు‌ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపితే రిజర్వాయర్‌కే ప్రమాదమని చెప్పడంతో 4 టీఎంసీల నీటితో నింపాల్సిన రిజర్వాయర్‌ను 2 టీఎంసీలతోనే సరిపెట్టారు.

2019 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు ఇంజనీర్లు రిజర్వాయర్‌ను పరిశీలించి బుంగలు పడ్డ, నీరు లీకేజీ అవుతున్న ప్రాంతాలను పరిశీలించి వాటిని ఎలా పూడ్చాలనే అంశాలపై నివేదిక ఇచ్చారు. కాని నేటి వరకు రిజర్వాయర్‌ కు ఏర్పడిన బుంగలను పూడ్చటానికి కసరత్తు నోచుకోలేదు. దీంతో ర్యాలంపాడు‌ రిజర్వాయర్ ను 2 టిఎంసీల లోపే నిల్వచేసే పరిస్థితులు నెలకొన్నాయి.

కమిటీల పేరుతో కాలయాపన..!

ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడ్డ బుంగలు పూడ్చడానికి కమిటీలు వేస్తున్నారు.. ఆ కమిటీల వల్ల కాలయాపన తప్పా బుంగలు పూడ్చడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2021లో రిటైర్డ్‌ ఇంజినీర్ల బృందం పర్యటన, లీకేజీలను నిలుపుదల చేయడం కోసం ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేపట్టడం, ఆ తర్వాత టెండర్‌ ద్వారా సాయిగణేశ్‌ కంపెనీకి అప్పజెప్పడం.. వారు రిపోర్టు సీడీవోకు పంపినా ఫలితం లేక పోవడం.. తదుపరి పుణె కమిటీ పరిశీలన చేసిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వకపోవడంతో ఈ పనులు కమిటీల పేరుతో కాలయాపన జరుగుతోంది.

ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ర్యాలంపాడు రిజర్వాయర్‌ పనులు పరిశీలించారు. నెట్టెంపాడ్‌ పెండింగ్‌ పనులతోపాటు ర్యాలంపాడ్‌ రిజర్వాయర్‌ మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు పడడం లేదు. నేటికి పనులు పూర్తి కాకపోవడంతో వానాకాలం సీజన్‌లో కూడా రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటిని నింపలేదు.

మంత్రి హామీ నీటిమూటలైనా?

గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ర్యాలంపాడును సందర్శించి నెట్టెంపాడు పెండింగ్ పనులు, మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.

తలాపున కృష్ణమ్మ పారుతున్నా… ఒక్క పంటకే సాగునీరు!

ముంగిట్లోనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా, నడిగడ్డ రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్, నేడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విస్మరిస్తోందని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులపై దృష్టి సారించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4టీఎంసీలతో నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్ కు లీకేజీ ఏర్పడటంతో 2 టీఎంసీలోపే నిల్వ చేస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీప్ సీజన్ కు పూర్తి స్థాయిలో సాగు నీరందించిన, యాసంగిలో ఆరుతడి పంటలకే పరిమితమైంది‌.

ఆరుతడి పంటలకే సాగునీరు

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక జూరాల ప్రాజెక్టు కు ఆలస్యంగా వరదలు వచ్చాయి. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయి రెండు నెలలు ముగిసింది. ర్యాలంపాడు రిజర్వాయర్ కు ఆలస్యంగా నీళ్లు వదలడంతో రిజర్వాయర్ నుంచి అతికష్టం మీద ఒక పంటకే సాగు నీరందేలా ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు రచించారు.‌‌ ఖరీప్ పంట వరకు పూర్తి స్థాయిలో సాగు నీరందిస్తే రైతాంగం గట్టెక్కినట్లే. రిజర్వాయర్ లీకేజీ వల్ల రెండో పంటకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>