జయశంకర్ ఒక వ్యక్తి కాదు శక్తి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ నీటి వాటాను కాపాడుకోవటమే.. ఆచార్య జయశంకర్ కు అర్పించే నిజమైన నివాళులు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆచార్య జయశంకర్ (Prof Jayashankar) జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

జయశంకర్ జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు అని కొనియాడారు. ఆయనకు సిద్దిపేటతో అవినాభావ సంబంధం ఉందని.. సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేసుకున్నామని గుర్తు చేశారు. జయశంకర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని పేర్కొన్న హరీశ్.. రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమని నమ్మి ఆయనతోనే వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు.

చరిత్ర పుటల్లో జయశంకర్ పోరాటం..

తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్ర పుటలలో నిలిచిపోతుందని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇవాళ రాష్ట్రం సాధించామంటే అది జయశంకర్, కేసీఆర్ పోరాటం వల్లనే అని చెప్పుకొచ్చారు. పదేళ్ళలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అద్భుతంగా నిలబెట్టారని.. కానీ ఇప్పుడు తెలంగాణ మీద సోయిలేని వ్యక్తి సీఎంగా ఉన్నారని విమర్శించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించిందని చెప్పారు.

కాంగ్రెస్ పై ఫైర్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదని అన్నారు. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. జీఆర్ఎంబీ ఏజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను అడ్డుకోవాలని చేర్చడం ఇదే మొదటి సారి అని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఇప్పటికైనా జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఎందుకు ఆపలేకపోతున్నారని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు.

Also Read : రైస్ స్కామ్.. వేల కోట్ల‌ సీఎంఆర్ రికవరీ పెండింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>