కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో మాయాజాలం వెలుగులోకి వచ్చింది. రెండు వానాకాలం పంటలతో పాటు రెండు యాసంగి సీజన్లకు సంబంధించి దాదాపు 900 వడ్ల లోడ్లకు పైగా బోనస్ కోసం బోగస్ వడ్లను కొనుగోలు (Paddy Procurement Scam) చేసినట్లు రికార్డులలో చూపించి పెద్ద ఎత్తున దండుకున్నారు. ఈ విషయంపై ఇదివరకే ఇంటలిజెన్స్ వారు ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. బోనస్ డబ్బులను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మద్దతు ధర డబ్బులు రైస్ మిల్లర్లు పంచుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు డబ్బు పంపకాలలో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం బహిర్గతం కావడం కలకలం రేపుతున్నది. ముఖ్యంగా కొన్ని కొనుగోలు కేంద్రాలతో పాటు బార్డర్ కొనుగోలు కేంద్రాలలో ఈ దందా జోరుగా సాగినట్లు స్పష్టంగా తెలుపుతున్నది.
నాలుగు సీజన్లలో 900 లోడ్లు..
జోగులాంబ గద్వాల జిల్లాలో 2024- 25 వానాకాలం, యాసంగి, 2025- 26 వాన కాలము యాసంగి సీజన్ లో రైతుల పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీని ఆసరాగా చేసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై కొనుగోలు చేయని వడ్లను కూడా కొనుగోలు చేసినట్లు రికార్డులలో చూయించి దాదాపు నాలుగు సీజన్లకు సంబంధించి 900 వడ్ల లోడ్లకు సంబంధించి అదనంగా చూయించి కోట్ల రూపాయలు దండుకున్నారు.
ఈ కేంద్రాలలో భారీ అవకతవకలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని గత వానాకాలపు సీజన్ లో వడ్ల కొనుగోలు చేసేందుకు 49 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గద్వాల మండలం బీరెల్లి, లత్తి పురం, జమ్మిచేడు, కొండపల్లి, ధరూర్ మండల పరిధిలోని రేవులపల్లి, ధరూరు,ఉప్పేర్, బురెడ్డిపల్లి, కేటి దొడ్డి మండల పరిధిలోని కేటీ దొడ్డి, కొండాపురం, వెంకటాపురం, నందిన్నే, గువ్వల దీన్నే, గట్టు మండల పరిధిలోని నందిన్నె, చింతలకుంట, ఆలంపూర్ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలలో పెద్ద ఎత్తున వడ్లు కొనుగోలు చేయకపోయినా కొనుగోలు చేసినట్లు చూపించారు.
బీరెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుండి వాస్తవంగా 71 వడ్ల లోడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ రికార్డులలో మాత్రం 101 లారీల వడ్లు కొనుగోలు చేసినట్లు చూపించారు. బీరెల్లిలో 30, లతీపురంలో 25, ధరూర్ లో 20, వెంకటాపురంలో 15, ఉప్పెర్ లో 20, రేవలపల్లి లో 28 వడ్ల లోన్లను అధికంగా చూపించారు. ఇలా జిల్లాలో మొత్తం ఒక సీజన్ కు సంబంధించి 300 వడ్ల లోడ్లు కొనుగోలు చేయకుండా చేసినట్లు చూయించి కోట్ల రూపాయలు దండుకున్నారు.
ఇలా పంచుకొని నొక్కేశారు
కొనుగోలు కేంద్రాలకు వడ్లు రాకున్నా వచ్చినట్లు చూయించి రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఆఫీసర్లు కుమ్మక్కై పంచుకొని డబ్బులు నొక్కేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తమకు అనుకూలమైన వారి బంధువుల పేర్లతో పాటు కొందరి తమకు అనుకూలమైన రైతుల పేర్లను ఎంట్రీ చేసి వారు వడ్లు తీసుకురాకున్నా వారి పేర్లపై ట్రక్ షీట్స్ నమోదు చేసి డేటాను ఎంట్రీ చేశారు. డబ్బులు అకౌంట్ లో పడ్డాక రైస్ మిల్లర్లకు మద్దతు ధర ప్రకారం క్వింటాలకు 2,389 రూపాయల చొప్పున చెల్లించి బోనస్ డబ్బులను క్వింటాల్ కు 500 చొప్పున కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఆఫీసర్లు, బోగస్ రైతులు దండుకున్నారు.
10 కోట్ల మేర దోపిడి..
గత వాలా కాలంలో కొనుగోలు కేంద్రాల్లో 97,16,52 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేశారు. 4,172 లోడ్లు వచ్చినట్లు రికార్డులలో ఉన్నాయి. ఒక గత వానాకాలం సీజన్ లోనే 300 లోడ్ల బోగస్ వడ్లు కొనుగోలు చేశారు. ఒక లోడుకు 300 క్వింటాళ్లు వడ్లు ఉంటే ఒక సీజన్లో 300 నోట్లకు సంబంధించి దాదాపు 5 కోట్ల బోనస్ ను నొక్కేశారు. నాలుగు సీజన్లకు కలిపి రెండు సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ డబ్బులు వారి అకౌంట్లో జమ చేసింది ఈ లెక్కన రెండు సీజన్లకు సంబంధించి పది కోట్ల మేర బోనస్ డబ్బులు పక్కదారి పట్టినట్లు అయింది.
ఒక మిల్లుపై కేసు.. మరో ఆఫీసరును పక్కకు పెట్టినా..
రైస్ మిల్లులకు వడ్లు పోకున్నా పోయినట్లు చూపించిన ఘటనలో గద్వాల మండల పరిధిలోని ఓ రైస్ మిల్ పై కేసు కూడా నమోదు అయింది. అదేవిధంగా ఆఫీసర్ వ్యవహార శైలిని గుర్తించిన జిల్లా ఆఫీసర్లు మొన్నటి యాసంగి సీజన్ లో ఆయనను పక్కనపెట్టి జిల్లాస్థాయి ఆఫీసర్ కు రైస్ మిల్లులకు వడ్లు కేటాయించే బాధ్యతలను అప్పజెప్పడం చూస్తుంటే పరిస్థితి ఏమేరా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ మొన్నటి సీజన్ లో అక్కడక్కడ అవకతవకలు చోటుచేసుకున్నాయి.
కొనుగోలు కేంద్రాల కోసం పోటాపోటీ..
ప్రతి సంవత్సరం జోగులాంబ గద్వాల జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల కోసం రాజకీయ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ధరూర్ మండల పరిధిలోని రేవులపల్లి కొనుగోలు కేంద్రం కోసం దాడులు సైతం జరిగాయి. మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు ఇచ్చినప్పటికీ ఆ కొనుగోలు కేంద్రాలలో పెత్తనం అంతా లీడర్లే చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బోగస్ వడ్ల లోడ్లతోపాటు, తరుగు పేరిట తీసిన వడ్లు ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ఒక లోడు వడ్లను అమ్ముకొని పెద్ద ఎత్తున నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు అదేవిధంగా క్వింటాలకు అదనంగా ప్రభుత్వం కమిషన్ కూడా ఇస్తున్నది. పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

