కలం, తెలంగాణ బ్యూరో: భారత్–రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారానికి ప్రతీక అని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. హైదరాబాద్‌లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఆ సంస్థ హెడ్ డాక్టర్ రాయల నీతు నాయుడుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యాలయం భారత్–రష్యా ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. రక్షణ, విజ్ఞానం, అంతరిక్షం, సాంకేతికత, ఇంధనం, విద్య వంటి కీలక రంగాల్లో భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు.
ఈ కార్యాలయం ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యాపారం, పర్యాటకం, సంస్కృతి, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రజల మధ్య పరస్పర సహకారం వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చారిత్రక వారసత్వంతో పాటు సాంకేతిక రంగంలో ప్రపంచ గుర్తింపు పొందిన నగరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్నేహం, శాంతి, అభివృద్ధి, సాంస్కృతిక అవగాహనకు దోహదపడే ప్రతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పోలీసు నియామకాలు, అటవీ హక్కులు, గతంలో నమోదైన కేసులు తదితర అంశాలపై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి వినతిని పరిశీలించిన మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, ప్రతి అర్జీపై బాధ్యతగా స్పందించి పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

