కలం, ఢిల్లీ బ్యూరో: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దీనికోసం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. బ్యారేజీ ఎత్తు పెంపు విషయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిర్ణయం జరిగినప్పుడే రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయని గుర్తుచేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో బుధవారం సమావేశమయ్యారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచుకుంటే గ్రావిటీ ద్వారానే నీటిని సరఫరా చేసుకోవచ్చని, మహారాష్ట్రలో ముంపు ప్రాంతం వెయ్యి హెక్టార్లకు మించదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఆ రాష్ట్రంలో ముంపు ప్రాంతంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నందున రెండు రాష్ట్రాల భేటీకి చొరవ తీసుకోవాలని సూచించారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.
ప్రధాని నుంచి వచ్చిన స్పందనపై వివరణ
తుమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రి పాటిల్‌కు సీఎం రేవంత్ వివరించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యం, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ, దానికి ప్రధానమంత్రి కార్యాలయం వచ్చిన స్పందన గురించి కూడా వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి గతంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
తుమ్మిడిహెట్టిని 148 మీటర్ల నుంచి 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించే అంశంపై పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) కూడా అధ్యయనం నిర్వహించిందని సీఎం వివరించారు. ఆ అధ్యయనం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా ముంపు విస్తీర్ణంలో పెద్దగా తేడా లేదని స్పష్టమైందన్నారు. ముంపు ప్రాంతంలో 50% రివర్ బెడ్‌లోనే ఉంటుందని తెలిపారు. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి పాటిల్‌ను సీఎం రేవంత్ కోరారు.
త్వరలో ఇరిగేషన్ మంత్రుల మీటింగ్..
తుమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారానే నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని, విద్యుత్ వినియోగం భారం ఉండదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు నీటి వసతి ఏర్పడుతుందని సీఎం రేవంత్ వివరించారు. ఈ అంశంపై మొదట కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర స్థాయి అధికారులతో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు.
ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. పాటిల్ తో జరిగిన సమావేశంలో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, ఎం.అనిల్ యాదవ్, కడియం కావ్య, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ.శ్రీధర్ పాల్గొన్నారు.
4 ప్రాజెక్టులకు అనుమతులివ్వండి..
పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయనను కలిసి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని సీఎం అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోతలపై రూ.3,187 కోట్లు, సీతమ్మ సాగర్‌పై రూ.1,835 కోట్లు, గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధులను వ్యయం చేసిందని భూపేందర్ యాదవ్‌కు రేవంత్ రెడ్డి వివరించారు. అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఫలితంగా ప్రాజెక్టుల వ్యయం పెరుగుతున్నదని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

