కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరులోని బీడు భూములు పచ్చని సిరులుగా మారుతున్నాయి. ఆయిల్ పామ్ తోటలతో కళకళలాడుతున్నాయి. సాగుతో అన్నదాతలు ఆర్థిక కష్టాలను అధిగమిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి సాగుతో వచ్చే నష్టాలకు బదులుగా రైతులు దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వనపర్తి, గద్వాల ప్రాంతాల్లో రైతులు ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన సాగు నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలకు విస్తరించింది. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం వస్తుందన్న భరోసా రైతులను సాగు వైపు ఆకర్షించింది.
35 వేల ఎకరాలు.. 10 వేల మందికిపైగా రైతులు
ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలో 10, 259 మంది రైతులు 33,888 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారు. అధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 2, 379 మంది రైతులు 8,840 ఎకరాల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో 1,350 మంది రైతులు 5,100 ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో 1,800 మంది రైతులు 6,068 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,890 మంది రైతులు 7,140 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 1840 మంది రైతులు 6,740 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను వేశారు. ఈ ఏడాది కూడా రైతులు ఆసక్తి కనబరుస్తూ ఒక్కో జిల్లాలో సుమారు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల్లో సాగు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆయిల్ పామ్ తోటల దిగుబడులను చూస్తున్న రైతులు ఇటువైపు దృష్టి సారిస్తున్నారు. కొన్నాళ్లకు సాగు రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు
ఆయిల్ సాగు పామ్ రైతుకు దన్నుగా సాగు భారమంతా ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 200 విలువైన మొక్కను కేవలం రూ. 20కే రైతులకు అందిస్తూ, నీటి వినియోగాన్ని తగ్గించే డ్రిప్ పరికరాలపై 90 – 100శాతం రాయితీని ఇస్తోంది. అంతేకాకుండా, అంతర పంటలుగా కూరగాయలు, వేరుశనగ సాగు చేసుకునే వెసులుబాటు ఉండటంతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
ప్రస్తుతం దాదాపు 3 వేల ఎకరాల నుంచి పంట చేతికి వస్తోంది. గెలలు కోసిన వెంటనే ఫ్యాక్టరీకి తరలించేందుకు వీలుగా గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆగస్టు నాటికి, జిల్లా యంత్రాంగం విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ సాగును మరింత వేగవంతం చేస్తోంది. ఆయిల్ పామ్ సాగు కేవలం ఒక పంట మార్పిడి కాదని, ఆర్థిక స్వావలంబన దిశగా వేసిన ముందడుగుగా చెప్పవచ్చునని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
మార్కెటింగ్ కు రైతు వద్దకే..
ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల రైతుల గెలలను ఆయిల్ ఫెడ్ కంపెనీ మార్కెటింగ్ చేస్తుందని అధికారులు తెలిపారు. రైతులు తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు తరలిస్తే అక్కడి నుంచి సంబంధిత కంపెనీ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఒక్కో టన్నుకు రూ 23, 482 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేస్తుందన్నారు. వనపర్తి సమీపంలోని సంకిరెడ్డిపల్లిలో కంపెనీ కోసం గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినట్లు, అయితే.. ఆయిల్ ఫెడ్ కంపెనీ కోసం జోగులాంబ జిల్లాలోని బీచుపల్లి సమీపంలోని విజయ వంటనూనెల కర్మాగాన్ని పునర్వ్యవస్థీకరించి పామాయిల్ తయారీ కేంద్రంగా మార్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.

