రైస్ స్కామ్.. వేల కోట్ల‌ సీఎంఆర్ రికవరీ పెండింగ్

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (Telangana) ఏర్పడినప్పటి నుంచీ రైస్ మిల్లుల అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ తొలి టర్ములో సివిల్ సప్లైస్ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడైనా, ఆ తర్వాత గంగుల కమలాకర్ బాధ్యతలు తీసుకున్నాకైనా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగానైనా కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR Scam) వ్యవహారంలో రైస్ మిల్లుల దోపిడీ సాగుతూనే ఉంది.

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం 51.98 లక్షల టన్నుల మేర కస్టమ్ మిల్లింగ్ రైస్ లెక్కల్లో గోల్‌మాల్ జరిగినట్లు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో సైతం 7.98 లక్షల టన్నుల మేర దారి మళ్లినట్లూ తేలింది. గత బీఆర్ఎస్ పాలనలో సీఎంఆర్ అక్రమాల విలువ రూ. 11,304 కోట్లుగా అంచనా వేస్తే.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల హయాంలో రూ. 2,095 కోట్లుగా వెల్లడైంది.

గత బీఆర్ఎస్ హయాంలోని సీఎంఆర్ అవకతవకల్లో రూ. 6,365 కోట్ల మేర (30.16 లక్షల టన్నులు) రికవరీ చేశామని, ఇంకా రూ. 4,939 కోట్ల (21.81 లక్షల టన్నుల) రికవరీ జరగాల్సి ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తేల్చింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన సీఎంఆర్ అవకతవకల్లో రూ. 403.64 కోట్ల మేర మాత్రమే రికవరీ చేయగా.. ఇంకా రూ. 1,691 కోట్ల మేర పెండింగ్లో ఉంది.

పేదల నోటికాడి ముద్దను లాగేసుకుంటున్న మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? రాష్ట్ర ప్రభుత్వం అంటున్న ఆడిట్లో దోషులుగా తేలేదెవరు? విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడేదేమిటి? డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామంటున్న మాటలన్నీ పూర్తిగా వాస్తవరూపం దాలుస్తాయా?! మొత్తంగా పుష్కరకాలంలో జరిగిన సీఎంఆర్ దందాలో ఇంకా రికవరీ చేయాల్సింది రూ. 6,630.74 కోట్లు (28.22 లక్షల టన్నులు).

రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగిపోతున్నది. 12ఏండ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది. రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి తిరిగి ఇవ్వాలని మిల్లర్లకు ఇస్తుంటే.. అందులో కొందరు సగం ఎగ్గొడుతున్నారు. పక్కదారి పట్టిస్తున్నారు. ఇవ్వాల్సిన టైమ్కు ఇవ్వకుండా సాకులు చెప్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఒక్క సీజన్‌లోనే రూ. 8,069 కోట్లు

తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 51.98 లక్షల టన్నుల మేర కస్టమ్ మిల్లింగ్ రైస్ లెక్కల్లో గోల్మాల్ జరిగినట్లు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తేల్చింది. ఆ మొత్తం విలువ రూ. 11,304 కోట్లు. అందులో రూ. 6,365 కోట్ల మేర (30.16 లక్షల టన్నులు) రికవరీ చేశామని, ఇంకా రూ. 4,939 కోట్ల (21.81 లక్షల టన్నుల) రికవరీ జరగాల్సి ఉన్నదని పౌరసరఫరాల శాఖ అంటున్నది.

– గత బీఆర్ఎస్ హయాంలో 2022-23 రబీ సీజన్‌లో 38.01 లక్షల టన్నుల ధాన్యం దారిమళ్లిందని, దీని విలువ సుమారు రూ. 8,069 కోట్లు అని ప్రస్తుత ప్రభుత్వం తేల్చింది. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన సీఎంఆర్ గోల్‌మాల్ వ్యవహారంపై సమగ్ర దర్యప్తు జరిపిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా రెండు రోజుల ముందు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 2022–23 రబీ సీజన్కు సంబంధించి రూ. 4,497 కోట్ల విలువైన 22.07 లక్షల టన్నులను రికవరీ చేయగలిగామని, మరో రూ. 3,572 కోట్ల విలువైన 15.94 లక్షల టన్నుల మేర రాబట్టాల్సి ఉన్నదని ఆ రివ్యూ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు.

– మొత్తం తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలోని సీఎంఆర్ అవకతవకల్లో ఇంకా 21.81 లక్షల టన్నులను రికవరీ చేయాల్సి ఉన్నది. గోల్‌మాల్ వ్యవహారానికి పాల్పడిన కొన్ని రైస్ మిల్లులకు నోటీసులు జారీచేయడంతో పాటు కొన్నింటిపై రికవరీ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రయోగించింది.

– గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లులే ఉన్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.

ఈ సర్కార్ చెప్పుడే.. చర్యలేవీ?

ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైస్ మిల్లుల సీఎంఆర్ దందాలు ఆగడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, దోపిడీకి పాల్పడుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా అక్రమాలకు పాల్పడిన మిల్లులపై పూర్తిస్థాయిలో చర్యల్లేవనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. ఇప్పటివరకు జరిగిన రికవరీలను చూస్తే ఆ అంశం స్పష్టమవుతున్నది. ఆ ప్రభుత్వంలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినా నివారించడంలో ఫలితాలు సాధించలేకపోయింది.

ఈ రెండున్నరేండ్లలోనూ సుమారు రూ. 2,095 కోట్ల మేర సీఎంఆర్ అక్రమాలు జరిగినట్లు గుర్తించడం అందుకు నిదర్శనం. ఇందులో రూ. 403.64 కోట్ల మేర మాత్రమే రికవరీ చేయగా ఇంకా రూ. 1,691 కోట్ల మేర రికవరీ చేయాల్సి ఉన్నది. మొత్తంగా తెలంగాణ వచ్చి పుష్కరకాలం అయినా కొందరు రైస్ మిల్లర్ల అక్రమాలు ఆగడంలేదు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం చెందడంతో రికవరీ కావాల్సిన రూ. 6,630.74 కోట్లు (28.22 లక్షల టన్నులు) ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయింది.

విజిలెన్స్ ఎంక్వైరీ.. సరికొత్త చర్చ!

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖలోని సీఎంఆర్ వ్యవహారంలో విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుండడం సెక్రటేరియెట్లో చర్చనీయాంశమైంది. ఆ శాఖలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించడంతోనే ఈ ఎంక్వైరీ జరుగుతున్నదని, ఆ డిపార్టుమెంట్ చూస్తున్న మంత్రి పనితీరుకు ఇది నిదర్శనమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
– గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోల్‌మాల్ జరిగిందని చెప్తున్న సమయంలోనే ఈ ప్రభుత్వంలోనూ విజలెన్స్ ఎంక్వైరీ జరగడం చర్చకు దారితీసినట్లయింది. ఇదే అంశాన్ని మంత్రి ఉత్తమ్ రెండు రోజుల క్రితం రివ్యూలో “ప్రతి గింజా ప్రజల ఆస్తే. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి రూపాయిని వసూలు చేస్తాం. దశాబ్ద కాలం సీఎంఆర్ వ్యవస్థపై సమగ్ర ఆడిట్‌కు ఆదేశిస్తున్నాం. డిఫాల్ట్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతాం. నిజాయితీ మిల్లర్లకు పూర్తి రక్షణ కల్పిస్తాం” అని వ్యాఖ్యానించారు.
– రెండున్నరేండ్లుగా ఉక్కుపాదం మోపినట్లయితే పూర్తి స్థాయిలో రికవరీ అయ్యేదని, లేదా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేసేదని, కేసులు పెట్టేదనే మాటలూ వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>