కలం, నిజామాబాద్ బ్యూరో: తమిళనాడు పర్యటనపై హరీష్ రావు (Harish Rao) వివరణ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాల సందర్శన వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. హరీష్ రావుకు ఎందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారనే సమాచారం ఉందని తాను వ్యాఖ్యానించడంతో తనతో పాటు పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రశ్నలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. నీటి ఒత్తిడికి బ్యారేజీలు నిలబడతాయో లేదో అన్న పరిస్థితి ఏర్పడిందని, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయని విమర్శించారు. ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. సీఎంఆర్ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పు జరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రి, మంత్రులకు స్పష్టం చేశామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలో జరుగుతుందని, ఎస్ఐఆర్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. బంకిన్‌పూర్ ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమి ఆ పార్టీకి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ పతనానికి బంకిన్‌పూర్ ఓటమే నాంది అని విమర్శించారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 80 శాతం సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

