కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో బుధవారం హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మట్ట రాగమయిదయానంద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల వివరాలతో పాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను సమగ్రంగా పరిశీలించి, తుది జాబితాను పీసీసీకి పంపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

