కలం, జోగుళాంబ గద్వాల: కర్ణాటక జలాశయాల నుంచి కృష్ణానదిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జూరాల జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. బుధవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 2,45,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, అవుట్‌ఫ్లో 2,48,791 క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తివేశారు.
జూరాల నుంచి 2,18,790 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిధిలో కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద కూడా కృష్ణమ్మ ఉరకలెత్తుతూ శ్రీశైలం జలాశయం వైపు పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, కుడి, ఎడమ సమాంతర కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి జూరాల జలాశయంలో 317.490 మీటర్ల నీటిమట్టం వద్ద 7.426 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 26,208 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 437 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1,300 క్యూసెక్కులు, కుడి కాలువకు 600 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరద ప్రవాహంతో జూరాల ప్రాజెక్టు కళకళలాడుతుండటంతో పరిసర ప్రాంతాలలో కృష్ణానది జల సోయగాలు కనిపిస్తున్నాయి.

