కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) నేతకాని సామాజిక వర్గం ఆత్మగౌరవానికి సంబంధించిన కీలక సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ రికార్డుల్లో తప్పుగా నమోదైన ‘నెట్కాని’ అనే పేరును సరిచేసి అసలు పేరు నేతకానిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వీరేంద్ర కుమార్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి పరిపాలనా విధానాన్ని ఎంపీ వంశీకృష్ణకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో పాటు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI), జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి అవసరమైన సిఫార్సులు అందిన అనంతరం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ తో కూడా చర్చించినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే అధికారిక లేఖను కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో నేతకాని వర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
“నేతకాని సమాజ గౌరవం, ఆత్మగౌరవం, గుర్తింపుకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రతి దశను స్వయంగా ఫాలోఅప్ చేస్తాను. ప్రభుత్వ రికార్డుల్లో సరైన పేరు ‘నేతకాని’ నమోదయ్యే వరకు మా కృషి కొనసాగుతుంది” అని వంశీకృష్ణ పేర్కొన్నారు. నేతకాని సమాజానికి చారిత్రక న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ, అవసరమైన అన్ని అనుమతులు, సిఫార్సులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

