కలం, నిర్మల్: గుడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమ గుడుంబా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాయి. నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ మండలం సింగాపూర్ తండా, రాజూరా, రాజూరా తండా, ఇక్బాల్ పూర్ గ్రామాలతోపాటు అటవీ ప్రాంతాల్లో బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ దాడుల్లో అధికారులు 6 కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 25 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 5 వేల లీటర్ల బెల్లం, పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, నల్లబెల్లం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగస్వామి హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ గంగారెడ్డి, ఎస్సైలు అభిషేక్, సింధు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరేందర్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

