కలం, మిర్యాలగూడ: అర్హులైన ప్రతి దివ్యాంగుడికి వేగవంతంగా గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు వేగవంతంగా అందించేందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆసుపత్రిలోని యూడీఐడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం పనితీరు, దివ్యాంగులకు అందించనున్న వైద్య సేవలు, కార్డుల జారీ ప్రక్రియపై వైద్యాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వైద్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఈ యూడీఐడీ కేంద్రం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డి, డీఎంహెచ్ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

