కలం, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న క్షుద్ర పూజల ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఇటీవల హరీశ్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar)కు నోటీసులు జారీ చేశారు. క్షమాపణ చెప్పి, వీడియో డిలీట్ చేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హరీశ్ హెచ్చరిక తర్వాత కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను మరింత సమర్థించుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం హరీశ్ రావు క్షుద్ర పూజలు చేయించారని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.
తాజాగా అద్దంకి దయాకర్ తనకు హరీశ్ రావు నుంచి వచ్చిన నోటీసులపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హరీశ్ రావు క్షుద్ర పూజలపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. హరీశ్ రావుకు చిత్తశుద్ధి ఉంటే అమ్మవారిపై ప్రమాణం చేసి క్షుద్రపూజలు చేయలేదని చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చెడ్డపేరు రావాలనే ఉద్దేశంతోనే క్షుద్రపూజలు చేయించారని అద్దంకి మరోసారి పునరుద్ఘాటించారు.

