చట్టం తప్పుతున్న ఖాకీలు.. నమ్మకాన్ని కోల్పోతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌!

కలం, కరీంనగర్ బ్యూరో: చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది వరుసగా వివాదాల్లో చిక్కుకోవడంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ (Karimnagar Police) ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇటీవల కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్‌ఐల వరకు పలువురు అవినీతి, అక్రమాలు, అనైతిక వ్యవహారాల్లో ఇరుక్కొని సస్పెన్షన్లు, అరెస్టుల పాలవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

వసూళ్ల ఆరోపణలు

వైన్స్, బార్లు, ఇసుక రవాణా, క్వారీల నుంచి కొందరు పోలీసులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు విరుద్ధంగా ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, దాడులు చేయడం, వేధింపులకు పాల్పడటం వంటి ఘటనలు కూడా వెలుగుచూశాయి. గతంలో భూ కబ్జాలు, వసూళ్ల ఆరోపణలపై ఏఎస్‌ఐ స్థాయి అధికారులు డిస్మిస్ కావడం, క్రిమినల్ కేసుల్లో పోలీసుల ఇన్ వాల్వ్ పైనా విమర్శలు వచ్చాయి.

వివాదాస్పద ఘటనలు

ప్రత్యర్థిని ఇరికించేందుకు గంజాయి కేసు బనాయించే ప్రయత్నం చేశాడనే ఆరోపణలపై ఈగల్ టీమ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజును కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అతని ఇంటి నుంచి 370.96 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో సీపీ గౌష్ ఆలం సస్పెండ్ చేశారు. మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల వివరాలను దుర్వినియోగం చేసి రూ.1.40 కోట్లకు పైగా అక్రమంగా స్వాహా చేసిన కేసులో పే సెక్షన్ ఉద్యోగితో పాటు పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

మహిళపై లైంగిక దాడి ఆరోపణలతో మాజీ ఎస్‌ఐ కదిరే శ్రీకాంత్ అరెస్టయ్యాడు. మరో కానిస్టేబుల్ మహిళతో అనుచితంగా వ్యవహరించిన వీడియో వెలుగులోకి రావడంతో అతడిని సస్పెండ్ చేశారు. యువకుడిపై దాడి, సెలూన్‌లో ‘సార్’ అనలేదని వ్యక్తిపై దాడి చేయడం, మహిళలపై వేధింపులు, స్టేషన్‌లో మహిళను కొట్టిన ఘటనలపై పలువురు పోలీసులపై సస్పెన్షన్, బదిలీ, కేసులు నమోదయ్యాయి.

ప్రజల్లో కోల్పోతున్న నమ్మకం

వరుస ఘటనలు పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. తప్పు చేసిన వారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్లు, కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం శాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. అంతర్గత పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, బాధ్యతారాహిత్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Karimnagar Police

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>