కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు (Rains) రైతుల్లో ఆశలు నింపాయి. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో వర్షాభావం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. వరి నాట్లు దాదాపు పూర్తికావడం తో పాటు వ్యవసాయ పనులు మళ్లీ జోరందుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వరి, 52,363 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పూర్తైంది. మొత్తం 4,91,287 ఎకరాల్లో పంటల సాగు పూర్తికాగా, మరో 30 వేల ఎకరాల్లో మాత్రమే సాగు మిగిలి ఉంది. గత ఏడాదితో పోలిస్తే వరి విస్తీర్ణం కొంత తగ్గినా, మొక్కజొన్న, సోయాబీన్, ఉద్యాన పంటల సాగు పెరిగింది.
ప్రాజెక్టులు పూర్తిగా నిండకపోయినా..
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండకపోయినా, ఇటీవల కురిసిన వర్షాలతో వాటిలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఖరీఫ్ పంటపై రైతుల ఆశలు మరింత బలపడ్డాయి. వర్షాల ప్రభావంతో జిల్లాలో వర్షపాత పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడింది. జూన్ 1 నుంచి జూలై 31 వరకు 439.1 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 460 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం సిరికొండ, ధర్పల్లి, మోస్రా, ఎడపల్లి, డిచ్‌పల్లి, నవీపేట మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవగా, మరో 25 మండలాలు సాధారణ వర్షపాతం పరిధిలోకి వచ్చాయి. ఆలూరు, సాలూర మండలాల్లో మాత్రమే ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతోంది. జూన్, జూలైలో వర్షాభావంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టిన రైతులు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మళ్లీ వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలో వరి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు.

