ప్ర‌తిప‌క్షంలోనే ప్ర‌శాంతంగా ఉందంటున్న కేటీఆర్!

కలం, తెలంగాణ బ్యూరో: ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హాయిగా ఉంది. ప్రశాంతంగా ఉంది’ అంటూ బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్లు ఆ పార్టీ కేడర్‌నే అయోమయానికి గురిచేస్తున్నాయి. పార్టీ చేస్తున్న ప్రయత్నాలు అధికారంలోకి రావడానికా? లేక ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండడానికా? అనే ప్రశ్నలు కిందిస్థాయి శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి పరిస్థితిని, అధికారంలో ఉన్నప్పటి పరిస్థితిని కేటీఆర్ వివరించడంతో పవర్‌లోకి రావాలనే ఉద్దేశం లేదా? లేక గ్రౌండ్‌లోనే అలాంటి పరిస్థితి కరువైందా? అన్న సందేహాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజల సమస్యలను తెలుసుకోడానికి తగినంత సమయం దొరుకుతుందంటూ కామెంట్ చేసి, అధికారంలో ఉన్నప్పుడు అలాంటి అవకాశం లేదని వ్యాఖ్యానించడంతో పవర్‌లోకి వస్తే ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉండవని చెప్పకనే చెప్పినట్లయిందని, ఇది పార్టీని డ్యామేజ్ చేయడానికి దారితీస్తున్నదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

ప్రతిపక్షంలో ఉంటేనే ప్రశాంతంగా ఉన్నాం. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడానికి, ప్రజా పోరాటాలు చేయడానికి సరిపడా సమయం దొరుకుతున్నది. క్షేత్రస్థాయిలోని సమస్యలు అర్థమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిమిషం తీరిక లేకుండా ఉండేవాళ్లం. బాధ్యతలు, పని ఒత్తిడితో సతమతమయ్యేవాళ్లం. అధికారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే సరిపెట్టుకునేవాళ్లం.
– జులై 24న టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్

బీఆర్ఎస్‌కు అలా.. కాంగ్రెస్‌కు ఇలా

అధికారంలో ఉన్నంతకాలం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం లేకుండాపోయిందని, అధికారులు చెప్పిన వివరాలనే నమ్మాల్సి వచ్చేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు మాత్రమే కాక ఇప్పుడు పవర్‌లో ఉన్న కాంగ్రెస్‌కూ వర్తిస్తాయనే పాయింట్‌ను శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌కు సైతం ఆనాడు బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరిస్థితులే ఉన్నాయని, ప్రజల సమస్యలను తెలుసుకోడానికి ప్రతిపక్షంలో ఉండడమే బెటర్ అనే మెసేజ్‌తో కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది కేడర్ భావన.

అధికారం లేకపోతే ప్రజల్లోకి రావట్లేదని కేసీఆర్ మీద ఒక సాధారణ అభిప్రాయం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పటి ప్రశాంతతను తన వ్యాఖ్యల ద్వారా హైలైట్ చేయడంతో అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కార్యకర్తల ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీని ప్రతిపక్షంలో ఉంచాలన్నదే కేటీఆర్ లక్ష్యమా? లేక అధికారంలోకి తేవడమా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రధాన ప్రతిపక్ష స్థానమూ దక్కనివ్వనన్న సీఎం

దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఒక ఆనవాయితీ కొనసాగుతున్నదని గుర్తుచేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండు టర్ములు కొనసాగుతున్నదని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా 2034 వరకు కంటిన్యూ అవుతుందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. జగిత్యాలలో మే 6న కేసీఆర్ బహిరంగసభ పెట్టిన రోజునే కరీంనగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జనజాతర పేరుతో నిర్వహించిన సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ ఉనికి కోల్పోవడం ఖాయం. బీఆర్‌‌ఎస్‌కు ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానమైనా దక్కింది. కానీ 2028 ఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా దక్కనివ్వం. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని తిని సిగ్గులేకుండా ప్రగల్భాలు పలుకుతున్నారు. మా కార్యకర్తల ఓపికను పరీక్షించకండి. మమ్మల్ని తాకాలంటే ముందు మా కార్యకర్తలను దాటుకుని రావాలి. మీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పాలనను చూసి మా వైపు వస్తున్నారు. మీ పార్టీ ఖాళీ కావడం ఖాయం. నమ్ముకున్న కార్యకర్తలను, నేతలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్, కేటీఆర్‌ ఉన్నారు” అని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>