కలం, తెలంగాణ బ్యూరో: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై సమగ్ర ఆడిట్ (CMR Audit) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేండ్లలో జరిగిన కార్యకలాపాలు, లావాదేవీలను కూపీలాగనుంది. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి రూపాయీ, ప్రతి గింజనూ వసూలు చేయనుంది. ధాన్యం సేకరణ నుంచి బియ్యం అప్పగింత వరకు జరిగిన ప్రతి లావాదేవీని పరిశీలించి, డిఫాల్ట్‌లు, పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలపై పూర్తి స్థాయి సమీక్ష చేపట్టాలని అధికారులను పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. గత దశాబ్ద కాలంగా సీఎంఆర్ కింద జరిగిన ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియ, ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగింత, జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ అంశాలు, రికవరీల పురోగతిపై ఇందులో చర్చించారు.
– ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కేవలం శిక్షలు విధించడం కాదని, ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రతి రూపాయి, ప్రతి గింజను తిరిగి రాబట్టడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
– పెండింగ్ బకాయిల్లో అధిక భాగం గత ప్రభుత్వాల కాలంలో పేరుకుపోయినవేనని అధికారులు వివరించారు. ప్రస్తుతం నగదు చెల్లింపులు, ధాన్యం తిరిగి అప్పగింత, నాణ్యమైన బియ్యం సరఫరా వంటి మార్గాల్లో గరిష్ఠ స్థాయిలో రికవరీలు సాధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
– గతంలో ఇచ్చిన గడువుల కారణంగా ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయని అధికారులు వెల్లడించారు. మిగిలిన ప్రతి కేసుపై మిల్లరు వారీగా గడువు నిర్ణయించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
– ఎంఎస్పీ కింద కొనుగోలు చేసే ప్రతి ధాన్యం గింజ వెనుక రైతు శ్రమతో పాటు ప్రజల సొమ్ము ఉందని, మిల్లర్లకు అప్పగించే ప్రతి బస్తా ధాన్యం ప్రభుత్వ ఆస్తి అని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని ఎక్కువ మంది రైస్ మిల్లర్లు నిజాయితీగా పనిచేస్తున్నారని, కొద్దిమంది మాత్రమే బియ్యం అప్పగింతలో జాప్యం చేయడం, దారి మళ్లించడం, ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
– నిజాయితీగా పనిచేసే మిల్లర్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అయితే ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
– విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రభుత్వ ధాన్యంపై నిర్వహించిన తనిఖీలు, నమోదైన కేసులు, రికవరీలు, న్యాయపరమైన చర్యలపై నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలు, స్టాక్ ధృవీకరణ, రికార్డుల పరిశీలన, అక్రమ మళ్లింపులపై విచారణ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సీఎంఆర్ వ్యవస్థలో సమూల మార్పులు:
భవిష్యత్తులో సీఎంఆర్ వ్యవస్థలో లోపాలకు తావులేకుండా నియంత్రణ విధానాలను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒప్పంద నిబంధనల కఠినతరం, బ్యాంకు గ్యారంటీల బలోపేతం, డిఫాల్ట్‌లపై కఠిన చర్యలు, సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ వంటి అంశాలను కొత్త విధానంలో చేర్చనున్నారు. ప్రతి గింజను పర్యవేక్షించేలా సాంకేతిక ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో.. క్యూఆర్ కోడ్ గన్నీ సంచులు, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్, జియో ట్యాగ్ తనిఖీలు, రియల్ టైమ్ స్టాక్ రీకన్సిలియేషన్, ప్రొక్యూర్మెంట్–మిల్లింగ్–ఎఫ్‌సీఐ డేటాబేస్‌ల అనుసంధానం, ఎర్లీ వార్నింగ్ వ్యవస్థ, రిస్క్ ఆధారిత మిల్లుల ఆడిట్లు వంటి చర్యలు చేపట్టనున్నారు.

