కలం, కరీంనగర్ బ్యూరో : దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని ఏఐవైఎఫ్ (AIYF) జిల్లా అధ్యక్షుడు పోలోజు రంజిత్, ప్రధాన కార్యదర్శి యుగంధర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల పోస్టర్ ను కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలోజు రంజిత్, యుగంధర్ మాట్లాడుతూ, భారతదేశంలో అత్యధిక జనాభా యువతదే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతకు ఉపాధి, విద్య, భద్రత కల్పించే దిశగా కాకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్ సోర్సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ వైపు సాగుతున్నాయని విమర్శించారు. జాతీయ యువజన విధానం పేరుతో ప్రకటనలు చేస్తున్నా, యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, అందుబాటు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదన్నారు.
దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయకుండా, ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. యువత రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం రాదన్నారు. పాలకులను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాడడం, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ హక్కు, విద్య హక్కు, వైద్య హక్కు, కార్మిక హక్కులు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలపై ఉద్యమాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువతకు కొత్త దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన విధానాలు, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యా, వైద్య రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, శాంతి, శాస్త్రీయ సోషలిజం వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిపి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహాసభల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోజుల సంతోష చారి, కోశాధికారి పెనమల్ల ఉదయ భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుపాకల సందీప్ ఎండి జహంగీర్, అందే శంకర్, బోయిని విష్ణు తదితరులు పాల్గొన్నారు.

