కలం, ఖమ్మం బ్యూరో: త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి సంచరించిన పవిత్ర భూమి, భద్ర మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమైన దివ్య క్షేత్రం భద్రాచలం (Bhadrachalam). దాదాపు 360 ఏళ్ల క్రితం భక్త రామదాసు నిర్మించిన ఈ చారిత్రక రామాలయం, నేడు తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో రూ.586 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ వైభవాన్ని సంతరించుకుంటోంది. తానీషా పాలనలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి చరిత్రకెక్కగా, నేడు ఆలయ ప్రాచీనత, ఆధ్యాత్మిక విశిష్టత చెరగకుండా సమగ్ర విస్తరణ చేపడుతున్న ప్రభుత్వాన్ని భక్తులు అభినందిస్తున్నారు.
దక్షిణ అయోధ్యగా కొలువైన ఈ దివ్య క్షేత్ర రూపురేఖలను మార్చి, నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో విస్తరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఆయా పనులకు శంకుస్థాపన చేయగా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో పనులు అత్యంత శరవేగంగా సాగుతున్నాయి. నిత్య పూజలకు, గర్భాలయ మూలవిరాట్ దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాంచరాత్ర ఆగమానుసారంగా ప్రాకారాల విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ముక్కోటి ఏకాదశి, పుష్కరాలే లక్ష్యంగా..
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయానికి నాలుగు దిక్కులా విశాలమైన మాడ వీధుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా 72 ఉపాలయాలు, తాత్కాలిక షెడ్ల తొలగింపు పూర్తయింది. రాబోయే ముక్కోటి ఏకాదశి నాటికి నూతన ‘ఉత్తర ద్వారాన్ని’ సిద్ధం చేయాలనే పక్కా ప్రణాళికతో అధికారులు శ్రమిస్తున్నారు. గత 44 ఏళ్లుగా ఉన్న పాత మెట్ల స్థానంలో అత్యంత ఆకట్టుకునే నూతన నిర్మాణాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
అంతేకాకుండా, వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆలయం నుంచి గోదావరి ఘాట్ వరకు ఉన్న రహదారి విస్తరణ, పాదచారుల మార్గాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్ వెలుగులు తాగునీటి వ్యవస్థలను సమగ్రంగా ఆధునీకరిస్తున్నారు. దక్షిణ మాడ వీధి విస్తరణకు అడ్డుగా ఉన్న నివాసాలు, దుకాణాల నిర్వాసితులకు ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
వారసత్వ సంపదకు రక్షణగా టెక్నాలజీ..
ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రాచీన వారసత్వ సంపదకు ఎలాంటి భంగం కలగకుండా అత్యాధునిక టెక్నాలజీని, శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. 1967లో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ శంకుస్థాపన చేసిన చారిత్రక చిత్రకూట మండపం తొలగింపు సమయంలో అత్యంత అరుదైన పురాతన రాతి స్తంభాలు, శిల్ప సంపద దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రతి రాతి స్తంభానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి, నిపుణుల పర్యవేక్షణలో సురక్షితంగా భద్రపరుస్తున్నారు. మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట పనుల నాణ్యతను, డ్రాయింగ్స్‌ను నిశితంగా పరిశీలించారు. పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం రోడ్లు, భవనాల శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

