కలం, వనపర్తి : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేయనున్న యూనిఫాంల కుట్టు పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ఆగస్టు 10లోగా పాఠశాలలకు అందించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి (Wanaparthy) జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టిచ్చింగ్ సెంటర్‌తో పాటు వనపర్తి మండలం రాజపేట గ్రామంలోని సెర్ప్ స్టిచ్చింగ్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా యూనిఫాంల కుట్టు పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి యూనిఫామ్‌ను నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా కుట్టి ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని, పనులను వేగవంతం చేసి ఆగస్టు 10వ తేదీలోగా పూర్తిచేసి సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్, డీపీఎం, మెప్మా, సెర్ప్ అధికారులు, స్టిచ్చింగ్ సెంటర్ల నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

