కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar) వైద్యాధికారి డాక్టర్ ఏ.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జిల్లాలోని అడ్డాకుల, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను ఆకస్మిక తనిఖీ చేశారు. అడ్డాకుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో నిర్వహిస్తున్న “ఆశ డే” సమావేశములో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఆశ, ఆరోగ్య సిబ్బంది వ్యాధుల నివారణ కార్యక్రమములను సంబంధిత శాఖల సిబ్బందితో సమన్వయముతో పనిచేసి ప్రజల ఆరోగ్యమును కాపాడాలని కోరారు.
అదేవిధంగా తల్లి పాల వారోత్సవములనుద్దేశించి తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివని , తల్లిపాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయని, ఇవి బిడ్డను ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి కాపాడుతాయని వెల్లడించారు. ఇవి చిన్నారి సున్నితమైన కడుపుకు తేలికగా జీర్ణమై,ప్రేగుల లోని బ్యాక్టీరియాను మెరుగుపరుస్తాయని అన్నారు. తల్లిపాలు తాగే పిల్లల్లో తెలివితేటలు, మెదడు ఆరోగ్యంగా ఉంటుందని.. తద్వారా భవిష్యత్తులో స్థూలకాయం, అస్తమా వచ్చే ప్రమాదం చాలావరకు తగ్గుతుందని అన్నారు.
తల్లులు బిడ్డకు పాలివ్వడం ద్వారా శరీరంలోని అదనపు కేలరీలు ఖర్చై ప్రెగ్నెన్సీ బరువు తగ్గుతారని చెప్పారు. ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై ప్రసవ అనంతర రక్తస్రావం తగ్గుతుందని తెలిపారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, మధుమేహం (షుగర్) వచ్చే రిస్క్ తగ్గుతుందని వెల్లడించారు. తర్వాత జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును తనిఖీ చేశారు.
Also Read : ఢిల్లీకి సీఎం రేవంత్.. వాటిపై కీలక చర్చలు..!
Follow Us On : WhatsApp

