కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం ‘సైబర్ జాగృక్త దివస్’ (Cyber Jagrukta Diwas) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రదేశాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
- తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు, లింకులు, OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు.
- సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలు, పెట్టుబడి ఆఫర్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, కస్టమర్ కేర్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, అధికారిక వెబ్‌సైట్లు, అధికారిక మొబైల్ యాప్‌లను మాత్రమే వినియోగించాలి.
- సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
- బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, రెండు దశల భద్రత (Two-Factor Authentication)ను తప్పనిసరిగా వినియోగించడం ద్వారా వ్యక్తిగత డిజిటల్ ఖాతాలను మరింత భద్రపరచుకోవాలని సూచించారు.
సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే అత్యంత ప్రభావవంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, సైబర్ జాగృక్త దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సురక్షితమైన డిజిటల్ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కోరారు.

