కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20) దారుణ పరిస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న పల్లవికి ఈ ఏడాది ఆగస్టు 30న పెద్దలు పెళ్లి జరిపించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది.
వివాహమైన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలంటూ భర్త శ్రీకాంత్ రెడ్డి నుంచి శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులు మొదలయ్యాయి. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ కావడంతో వాటిని భరించలేకపోయిన పల్లవి, తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది (BTech Student Suicide).
తీవ్రగాయాలపాలైన ఆమెను తొలుత జీడిమెట్లలోని నీలిమ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మేడిపల్లిలోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో పల్లవి మృతి చెందింది. ఈ ఘటనపై పల్లవి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

