తీవ్ర ఉద్రిక్తతల నడుమ పాత పంచాయతీ భవనం కూల్చివేత.. సర్పంచ్ అరెస్ట్!

​కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ( Mannempalli) గ్రామంలో పాత గ్రామ పంచాయతీ భవనం కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు జేసీబీలతో గ్రామానికి చేరుకుని పాత భవనాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ​దీంతో సర్పంచ్ సునీతతో పాటు పలువురు వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు కూల్చివేతను అడ్డుకున్నారు.

​గ్రామసభ తీర్మానానికి విలువ లేదా?: సర్పంచ్ ఆగ్రహం

ఇటీవల నిర్వహించిన గ్రామసభలో పాత పంచాయతీ భవనాన్ని గ్రామ అవసరాల కోసం వినియోగించుకోవాలని తీర్మానం చేశామని, అందులో భాగంగానే ఇటీవల మరమ్మతులు కూడా చేపట్టామని సర్పంచ్ సునీత తెలిపారు. గ్రామసభలో తీర్మానం చేసినప్పటికీ, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతకు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభ తీర్మానానికి విలువ లేదా? అని నిలదీశారు. కాగా, భవనం కూల్చివేతకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పగా.. తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని సర్పంచ్ స్పష్టం చేశారు.

​నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కూల్చివేతను అడ్డుకున్న సర్పంచ్, పాలకవర్గ సభ్యులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా నిరసనకారులు “ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అధికారులు చివరికి పాత పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>