ఆరోగ్య రంగానికి కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత: ఎమ్మెల్యే బాలు నాయక్

కలం, దేవరకొండ : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) పేర్కొన్నారు. నల్గొండ (Nalgonda) జిల్లా గుడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే వైభవంగా ప్రారంభించారు. అనంత‌రం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, అందించే వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, మౌలిక వసతుల కల్పన, వైద్య సిబ్బంది నియామకం, ఆధునిక పరికరాల ఏర్పాటు ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఇంటి వద్దకే చేరవేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఉపకేంద్రం ద్వారా గుడిపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడ సాధారణ ఆరోగ్య పరీక్షలు, తల్లి-శిశు సంరక్షణ, టీకాలు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు, ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైన మందులు ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని కోరారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా పలకరించి, మానవత్వంతో సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి ఎమ్మెల్యే ఆదేశించారు. పేదలు, వృద్ధులు, గర్భిణీలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా పనిచేయాలని సూచించారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన వైద్యం, విద్య, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>