కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన వివిధ రకాలప్ర త్యేక వైద్య సేవలను అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిస్థితి కమిషనర్ లేక గాలిలో దీపంలా మారిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్ రావును రాష్ట్ర వైద్య విద్య ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి వినతిపత్రం అందజేశారు.
గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీ మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు తదితర అంశాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి లేకుండా పోయారని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని గతం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పుకొచ్చారు.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం దురదృష్టకరమని విమర్శించారు. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండాపోతుందని.. నిరసన చేస్తున్నా పట్టించుకోవడం లేదనని విమర్శించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని చెప్పారు.

