కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ -20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆప్ పార్టీ నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలోని ప్రధాని మోడీ (PM Modi) నివాసం వరకు మార్చ్ చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ-20 పెట్రోల్ కు వ్యతిరేకంగా 2 లక్షల మంది సంతకాలతో కూడిన పిటిషన్ను ప్రధానికి అందజేయాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) భావిస్తున్నారు.
ఈ-20 పెట్రోల్ వాడకం వల్ల వాహనదారులకు ఏ ప్రయోజనం లేదని.. పైగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ-20 పెట్రోల్ ఎందుకు వాహనదారులు వాడాలని ఆయన ప్రశ్నించారు. ఇథనాల్ విధానం ఎందుకు లోపభూయిష్టంగా ఉందో ప్రధాని మోడీతో చర్చించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఈ నిరసన ప్రదర్శన భారీగా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటె లాఠీ దెబ్బలకు భయపడని తన లాంటి 100 మందిని మాత్రమే ఈ ర్యాలీకి తీసుకెళ్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ -20 పెట్రోల్ వినియోగం విషయంలో కేంద్రాన్ని ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నామని అన్నారు. స్వచ్ఛమైన పెట్రోల్ వాడాలో లేక ఈ -20 పెట్రోల్ వాడాలో నిర్ణయించుకునే హక్కు వాహనదారులకు మాత్రమే ఉండాలని తెలిపారు. ఒకవేళ ఈ -20 పెట్రోల్ ప్రభుత్వం తప్పనిసరి చేయాలనుకుంటే అది సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గటంతో దేశంలో లీటర్ పెట్రోల్ రూ.84 కంటే తక్కవ ధరకే అందించాలని డిమాండ్ చేశారు.

