కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలలో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగడంతో కామారెడ్డి వైపు ఉన్న చెరువులు వాగులలో భారీ వరద ప్రవాహం పెరిగింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో కామారెడ్డి పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు, కాలనీలలో నీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు చేరింది. గొల్లపల్లి నుండి రంగంపేటకు పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ మార్గంలో వరద నీటిలో చిక్కుకుంది. సైలెన్సర్లో నీరు చేరడంతో బస్సు రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. అప్పటికే అక్కడ రోడ్డుపై మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాడు సహాయంతో బస్సులో ఉన్న 45 మంది పెళ్లి బృందం వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ ఇబ్బంది కాకపోవడంతో అటు పెళ్లి వారు ఇటు పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..

