కలం, తెలంగాణ బ్యూరో: పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ (Telangana)లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల (Irrigation Projects) పై అధికారులకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆరు నెలల్లో అనుమతులు వచ్చేలా డెడ్‌లైన్ విధించుకుని, దానికి తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను నిర్దేశిత కాలపరిమితిలోగా సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పర్యావరణ అనుమతుల విధానాలపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన స్పష్టమైన తీర్పు నేపథ్యాన్ని దృష్టిలో చేసుకుని.. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర చట్టబద్ధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను స్పీడప్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆ అప్లికేషన్లకు సవరణలు
– రివ్యూ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. గతంలో పర్యావరణ అనుమతులు జారీ అయిన ప్రాజెక్టుల రక్షణతో పాటు, పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి, కేంద్రం రిజెక్ట్ చేసిన ప్రతిపాదనలకు టెక్నికల్ సవరణలు చేసి మళ్లీ సమర్పించడానికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఉపయోగపడుతుందని అధికారులకు వివరించారు.
– రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం చేసిన నిరంతర న్యాయ పోరాటం కారణంగానే సుప్రీంకోర్టు నుంచి ఈ తీర్పు వచ్చిందని ఆయన ఉదహరించారు.
– రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు నీటిపారుదల శాఖలోని ‘ఇంటర్-స్టేట్ వింగ్’ను మరింత బలోపేతం చేయాలని ఉత్తమ్ నిర్దేశించారు.
– ప్రాజెక్టుల వారీగా చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన గడువును సమావేశంలో ఖరారు చేశారు. వారం రోజుల్లో నోడల్ అధికారులను నియమించి రికార్డులను క్రోడీకరించాలని, నెల రోజుల్లో పర్యావరణ అధ్యయనాలు, భూసేకరణ రికార్డులు పూర్తి చేసి, రెండు నెలల్లో ప్రధాన పరిపాలనా ప్రక్రియను ముగించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఆరు నెలల్లో పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా వీక్లీ ప్రోగ్రెస్ రిపోర్టులతో పాటు ప్రతి నెలా ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.
గౌరవెల్లి పంప్ హౌస్ తక్షణం ఫంక్షనింగ్‌లోకి
గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను తక్షణమే ఉపయోగంలోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని, రెండు ప్రధాన కాల్వల్లోని నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి పనుల అంచనాలను రూపొందించాలని ఇంజనీర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సీతారామ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అధ్యయనాలను, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ రావడానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లను జాప్యం లేకుండా తయారుచేసి పంపాలన్నారు.
కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టేలా ఇంజనీరింగ్ ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు కూడా కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సుప్రీంకోర్టు కేసుల విషయంలో అదనపు అడ్వకేట్ జనరల్, న్యాయ బృందాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తుగా కౌంటర్ అఫిడవిట్లు సిద్ధం చేయాలని సూచించారు.
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపైనా చర్చ
– ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా తెలంగాణ పరిధిలోని ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రాంతాలకు కలిగే ముంపు ప్రభావంపైనా అధికారులు, మంత్రులు ఈ సమావేశంలో చర్చించారు.
– బ్యాక్‌వాటర్‌తో జరిగే నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేసి, దానికి తగిన ఫీల్డ్ డేటా, ఆర్థిక అంచనాల నివేదికలతో కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముందు బలమైన వాదనలు వినిపించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
– ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందే ముంపు నష్టపరిహారం సాధించేలా తెలంగాణ సర్కారు కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని ఆయన అన్నారు.
– సమీక్షలో న్యాయవాది శ్రావణ్ కుమార్, ఈఎన్సీలు ఓ.వి.రమేష్ బాబు, పి.శ్రీనివాస్, ఆర్.మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

