కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి (Bhu Bharati) ప్రాజెక్ట్ లో పని చేస్తున్న 635 మంది ఆపరేటర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని, తమ ఉద్యోగాలు తీసుయోద్ధని కోరుతూ నిజామాబాద్ లో ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ పిల్లలతో సహా కలెక్టరేట్ కు తరలివచ్చారు. తాము 2018 నుంచి పని చేస్తున్నామని అకస్మాత్తుగా తీసేస్తే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి కలెక్టర్ భుజంగరావ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
తమకు 16 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జేసి దృష్టికి తెచ్చారు. భూ భారతి ధరణి పనులే కాకుండా తహసీల్ కార్యాలయాలలో అనేక పనులు చేయించారని చెప్పుకొచ్చారు. అయినా తప్పని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం పని భారం భరించామని అన్నారు. ఇన్నాళ్లు పని చేసిన తాము వేరే పోస్టులకు ప్రిపేర్ కాలేదని, వయసు పరిమితి కూడా దాటిందని.. అందుకే తమ సర్వీస్ కంటిన్యూ చేయాలని కోరుతున్నామన్నారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం అందించాక కలెక్టరేట్ భవనం ముందు పిల్లలతో సహా ధర్నా చేశారు. తమ పిల్లలను చూసైనా వారి కోసం ఉద్యోగాలు కొనసాగించి ఆదుకోవాలని వేడుకున్నారు.

