కలం, నిర్మల్: ప్రజాప్రతినిధులను గౌరవించడం అధికారుల బాధ్యత అని ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ నీరజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను సమీక్షించిన ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో సర్పంచ్‌లు ప్రస్తావించే సమస్యలను అధికారులు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, తాగునీటి సరఫరా తదితర సమస్యల పరిష్కారానికి అధికారులు సర్పంచ్‌లతో కలిసి గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు.
సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను 45 రోజుల్లోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

