కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వస్తారనే దానిపై జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 15 నుంచి ఆయన పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇదివరకే ప్రకటించారు. కానీ నేటి వరకు ఆయన మంగళగిరి కార్యాలయానికి రాలేదు. దీంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పార్టీ క్యాడర్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం, ప్రత్యేక చికిత్స నిమిత్తం పవన్ కల్యాణ్ కేరళ వెళ్లారు. అక్కడ తన చికిత్సను పూర్తి చేసుకున్న ఆయన, సెప్టెంబర్ 12 నాటికి కేరళ పర్యటన ముగిసినట్లు స్వయంగా తెలిపారు. అయితే ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానున్న నేపథ్యంలో జనసేన నేతలు బిజీ అయ్యారు. కానీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో నాయకులు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

