కలం, అచ్చంపేట : పులుల సంరక్షణలో భాగంగా తమ గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని, తమ గ్రామ అభివృద్ధి తమకు కావాలంటూ అమ్రాబాద్ (Amrabad ) మండలం వటవర్ల పల్లి గ్రామ ప్రజలు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా గ్రామంలో కూడా సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టాలి అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ ను కోరారు.
ఈ సందర్భంగా వటవర్లపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ”మా గ్రామం నుండి మేము ఎవరము రీ లొకేషన్ కు వెళ్లము, మాకు గ్రామ అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి లబ్ధి దారులకు అందాల్సిన ప్రతి అభివృద్ధి పలాలను మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరుతాయని హామీ ఇచ్చారు” అని గ్రామస్తులు తెలిపారు. సమగ్ర అభివృద్ధికి సహకరిస్తాం, రీ లొకేషన్ ప్రక్రియ గురించి డిఎఫ్ తో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి తెలుసుకుంటానని చెప్పడం జరిగిందని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బిచ్చని, మాజీ సర్పంచ్లు చత్రు నాయక్, సరియా నాయక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వెంకటపతి, గ్రామ పెద్దలు ఇమ్మడి కిష్టయ్య ,కాశయ్య ,భవాని, కృష్ణా నాయక్ ,వెంకటేశ్వర్లు, యువకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, చెంచు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.

