కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) సోమవారం మంథని పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. పలు ప్రభుత్వ నిర్మాణాలు, అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ముందుగా నూతన ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంథని నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించారు.
నిర్లక్ష్యం సహించబోం..
ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్‌కు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంథని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం వకీల్ సాబ్ బేగ్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రిని పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్, ప్యాక్స్ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు శశిభూషణ్ కాచే, బొబ్బిలి శ్రీధర్ పాల్గొన్నారు.

