కలం, వెబ్ డెస్క్: తమిళనాడు, కర్ణాటక మధ్య నెలకొన్న కావేరి జల వివాదంలో (Cauvery Water Dispute) కీలక పరిణామం చోటు చేసుకుంది. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరి నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను ఆదేశించాలని విన్నవించింది. తమ నీటి వాటాలో అన్యాయం జరుగుతోందని వివరించింది. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
సరిపడా నీరు ఉన్నా..
గత నెలలో జరిగిన కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) సమావేశమై జులై 29వ తేదీ నుంచి ఆగస్ట్ 12 వరకు కర్ణాటక నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. కృష్ణారాజ సాగర్ డ్యాం నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించినా.. కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. దీంతో, కావేరి నదీ జలాల మీద ఆధారపడిన తమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంది. కర్ణాటకలోని జలాశయాల్లో సరిపడా నీరు ఉన్నా.. విడుదల చేయకపోవడం సరికాదని అభిప్రాయపడింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంను కోరింది.

