కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) అన్నారు. సోమవారం నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రిజిస్టర్లను పరిశీలించారు. నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కార తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం మరింత పెరిగేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

