కలం, వనపర్తి: కొల్లాపూర్ బార్ అసోసియేషన్ (Kollapur Bar Association) కు చెందిన సీనియర్ న్యాయవాది డా. బి. మల్లయ్య హత్య (Mallaiah Murder) ను జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన కేవలం ఒక న్యాయవాదిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని సంఘం అధ్యక్షుడు నాసనల్లి రాజు సాగర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
న్యాయవాదులు నిర్భయంగా విధులు నిర్వహించే వాతావరణాన్ని దెబ్బతీసే ఇటువంటి ఘటనలు ఆందోళనకరమని తెలిపారు. ఈ నేపథ్యంలో వనపర్తి బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ, దివంగత న్యాయవాది డా. బి. మల్లయ్యకు నివాళులర్పిస్తూ సోమవారం కోర్టు విధులను బహిష్కరించే నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ హత్య (Mallaiah Murder) కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని నిష్పాక్షికంగా, వేగవంతంగా దర్యాప్తు జరిపి నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమర్థమైన భద్రతా వ్యవస్థను అమలు చేయాలని కోరారు.
Also Read : బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
Follow Us On : WhatsApp

